ఇరాన్‌పై అమెరికా కొత్త ఆర్థిక ఆంక్షలు విధించడంతో టెహ్రాన్ తీవ్రంగా స్పందించింది. ఇరాన్ అంతర్జాతీయ ఆర్థిక సంబంధాలను తెంచేయాలనే లక్ష్యంతో అమెరికా ఈ చర్యలు తీసుకుంది. టెహ్రాన్‌తో సంబంధాలు కొనసాగించి నగదు అక్రమ చలామణికి సహకరించే దేశాలను డాలర్ వ్యవస్థ నుంచి దూరం చేస్తామని యూఎస్ ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ ప్రకటించారు.

దీనికి ఇరాన్ దీటైన కౌంటర్ ఇచ్చింది. ట్రంప్ ప్రభుత్వం విధించిన ఆంక్షలను ఎదుర్కోవడానికి తమ వద్ద రెండేళ్ల ప్రణాళిక ఉందని, ప్రతీకార చర్యలు తప్పవని స్పష్టం చేసింది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ గాలిబఫ్ సోషల్ మీడియాలో స్పందిస్తూ, “అమెరికన్ల ప్రగల్భాలను ఎవరూ నమ్మరు. ఇతర దేశాలతో ఇరాన్ సంబంధాలను తెగ్గొట్టే స్థితిలో అమెరికా లేదు. మా వాణిజ్య భాగస్వాములు ఇప్పటికే ఆంక్షలను పట్టించుకోబోమని సందేశాలు పంపారు” అని పేర్కొన్నారు.

ఇరాన్ ఆర్థిక మంత్రి అలీ మదానీజాదేహ్ కూడా ఇలాగే మాట్లాడారు. “అమెరికాకు మరో ఓటమి తప్పదు. కొత్త ఆంక్షలను ఎదుర్కోవడానికి మా వద్ద రెండేళ్ల ప్లాన్ ఉంది. ఇరాన్ ప్రజలు, అధికారుల సంకల్పాన్ని పరీక్షించడానికి వారు చేయగలిగిందంతా చేశారు. కానీ ప్రతిసారీ విఫలమయ్యారు” అని సవాలు విసిరారు.

ఇరాన్‌పై అమెరికా విధించిన ఈ తాజా ఆంక్షలను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సమర్థించారు. ఇరాన్‌తో పాటు దానికి మద్దతుదారులను లక్ష్యంగా చేసుకున్న ఈ చర్యలతో భారీ మూల్యం వసూలు చేయవచ్చని ఆయన అన్నారు. ‘ఆపరేషన్ ఎకనామిక్ అవుట్‌కాస్ట్’ పేరిట 60 సంస్థలు, వ్యక్తులు, నౌకలపై అమెరికా ఆంక్షలు విధించింది. ఇవి ఇరాన్ సైనిక కార్యకలాపాలు, పెట్రోలియం, పెట్రోకెమికల్ వాణిజ్యంతో అనుబంధం ఉన్నాయని ఆరోపించింది.

ఈ జాబితాలో భారత్‌కు చెందిన నాలుగు కంపెనీలు కూడా ఉన్నాయి. పోర్టీజ్ పార్ట్‌నర్స్ ఎల్‌ఎల్‌పీ, సదాశివ ఓవర్సీస్ లిమిటెడ్, పీపీ సాఫ్ట్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్ (డైరెక్టర్ ప్రశాంత్ గార్గ్), ప్రకృతీస్ ఇన్‌ఫ్రా ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్‌పై ఆంక్షలు విధించారు. ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు కొత్తేం కాకపోయినా, తాజా చర్యలు ఆర్థికంగా వెన్నువిరిచే ప్రయత్నంగా చూడబడుతున్నాయి.

Leave a Reply

Join the Frontpage Family

Get the latest political news, updates, and insights from Andhra Pradesh & Telangana delivered straight to your inbox.

You May Also Like

H1B వీసా కావాలంటే లక్ష డాలర్లు కట్టాల్సిందేనా?

H1B వీసాలపై ఎప్పటినుంచో గగ్గోలుపెడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, వాటిని కంట్రోల్ చేయడానికి తాను…