పేరుకు ఘనత వహించిన హైదరాబాద్ పోలీస్.. ఎంతటి క్రిమినల్ అయినాతమ నుంచి తప్రించుకోలేడంటూ ప్రగల్భాలు.. కానీ ఓ మంత్రి మాజీ ఓఎస్డీని పట్టుకోలేక ఆపసోపాలు పడుతుండటం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నేరుగా సీఎంవోనే జోక్యం చేసుకున్నా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం అనేక అనుమానాలను కలిగిస్తోంది. ఈ కేసులో అసలేం జరుగుతోందంటూ ఆరా తీసిన ఫ్రంట్ పేజ్ టీమ్ కు ఎన్నో అవాక్కయ్యే విషయాలు తెలిశాయి. ఆ విషయాలు తెలుసుకోకుండా స్టోరీని పూర్తిగా చదవండి…
బోడుప్పల్ రియల్టర్ గొంగిడి హరికృష్ణను రూ.10 కోట్లు ఇవ్వాలని బెదిరించి, దానికి నిరాకరించినందుకు చావ బాదారన్నది మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ పై ఇప్పటికే కేసు నమోదయ్యింది. అయితే ఘటన జరిగినప్పటి నుంచి జూబ్లీహిల్స్ సీఐ ముత్తు యాదవ్ సస్పెన్షన్ దాకా ఈ కేసులో ఎన్నో పరిణామాలు జరిగాయి.
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్టీ సుమంత్ తదితరులపై నమోదైన హత్యాయత్నం కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. జులై 30న జూబ్లీహిల్స్ లోని జింఖానా క్లబ్ సమీపానికి హరికృష్ణను పిలిపించిన సుమంత్ అక్కడే ఇనుపరాడ్ తో అతడిని కొట్టాడు. ఆ తర్వాత తన అనుచరులు బత్తిని అరుణ్ కుమార్, ముత్యాల మహేందర్ రెడ్డి, పసుపులేటి కార్తీక్ కుమార్ తోనూ కొట్టించాడు. హరికృష్ణ తీవ్రంగా గాయపడడంతో ఆందోళన చెందిన సుమంత్ ఈ విషయాన్ని హైదరాబాద్ పోలీసుల్లో కీలక అధికారికి ఫోన్ చేసి చెప్పినట్లు తెలుస్తోంది. ఆ పోలీస్ అధికారి జూబ్లీ హిల్స్ సీఐకి ఫోన్ చేసి స్పాట్ కు వెళ్లమని ఆదేశించారట. అక్కడికి వెళ్లిన సీఐ మొత్తం విషయాన్ని ఆ అధికారికి ఫోన్ చేసి వివరించారట. ఇద్దరినీ సెటిల్ చేసి పంపించేయ్ అని ఆయన చెప్పడంతో పాటు, హరికృష్ణ కూడా ఫిర్యాదు చేయడానికి నిరాకరించడంతో సీఐ ముత్తుయాదవ్ వారిని అక్కడినుంచి పంపేసినట్లు సమాచారం. అంతా ఉన్నతాధికారి చెప్పు చేతల్లో ఈ వ్యవహారం జరగ్గా, సీఎంవో నేరుగా జోక్యం చేసుకోవడంతో ఆయన తప్పించుకవడానికి సీఐను బలి పశువును చేసినట్లు కనిపిస్తోంది.
సుమంత్ ఆచూకీ నిజంగానే తెలియదా?
ఈ కేసులో ఇంత వరకు సుమంత్ అనుచరులు ముగ్గురిని, ఆయన డ్రైవర్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ సుమంత్ ఎక్కడ ఉన్నాడన్న సంగతి మాత్రం కనిపెట్టలేకపోయారు. మరోవైపు సుమంత్ సన్నిహితులు మాత్రం అతను హైదరాబాద్ లోనే ఉన్నట్లు చెబుతున్నారు. హైకోర్టులో బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేయడాన్ని దానికి నిదర్శనంగా చూపిస్తున్నారు. ఓ వైపు లాయర్లతో సుమంత్ చర్చలు జరుపుతూ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసినా, అతడి ఆచూకీ పోలీసులకు నిజంగా తెలియదనుకోవాలా లేక తెలిసీ కోర్టు నుంచి బెయిల్ వచ్చే వరకూ సమయం ఇచ్చేలా డ్రామా చేస్తున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. సుమంత్ కు పోలీసు ఉన్నతాధికారులతో పాటు కొంతమంది మంత్రులతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, వాళ్లే అతడిని అరెస్టు కాకుండా కాపాడుతున్నారని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దీనిపై సీఎంవో ఎలా వ్యవహరిస్తుందన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. కోరి తెచ్చుకున్న అధికారులే గీత దాటి వ్యవహరించడాన్ని సీఎం కూడా సీరియస్ గానే కీసుకున్నట్లు సమాచారం. హైదరాబాద్ పోలీస్ వ్యవస్థను ను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయకపోతే ముడు దాడులు ఆరు సెటిల్మెంట్లు అంటూ క్రిమినల్స్ మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉంది.