నిజమే.. గుండె భారంగా మారినా, కళ్లు చెమర్చినా ఈ నిజాన్ని నమ్మి తీరాల్సిందే! ప్రపంచ ఫుట్‌బాల్ సామ్రాజ్యాన్ని దశాబ్దాల పాటు ఏకఛత్రాధిపత్యంగా ఏలిన అర్జెంటీనా మంత్రగాడు, దిగ్గజాలకే దిగ్గజం లియోనెల్ మెస్సీ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు వీడ్కోలు పలికారు. మైదానంలో డిఫెండర్లను ముప్పుతిప్పలు పెడుతూ, బంతిని పాదాల మధ్య బంధించి అద్భుతాలు సృష్టించే ఆ ‘మెస్సీ మ్యాజిక్’ ఇకపై అంతర్జాతీయ వేదికలపై కనిపించదు. “దేశ జెర్సీ కోసం నా శక్తినంతా ధారపోశాను.. తప్పుకోవడానికి ఇదే సరైన సమయం” అంటూ మెస్సీ పంచుకున్న భావోద్వేగ సందేశం కోట్లాది మంది అభిమానుల గుండెలను పిండేసింది. అంతర్జాతీయ మ్యాచ్ లకు ఆయన దూరం జరిగినప్పటికీ, క్లబ్ ఫుట్‌బాల్‌లో భాగంగా ‘ఇంటర్ మయామి’ తరఫున మాత్రం ఈ మాంత్రికుడి ఆట కొనసాగనుంది.
అసలు మెస్సీ కెరీర్ ఒక సినిమాను తలపిస్తుంది. అర్జెంటీనాలోని రోసారియో అనే చిన్న పట్టణంలో పుట్టి, చిన్నతనంలోనే హార్మోన్ లోపంతో బాధపడుతూ, ఆట ఆడటమే కష్టమనుకున్న ఒక బాలుడు ప్రపంచాన్ని శాసిస్తాడని ఎవరూ ఊహించలేదు. కానీ ఆయనలోని అసాధారణ ప్రతిభను గుర్తించిన బార్సిలోనా క్లబ్, చికిత్స అందించి అక్కున చేర్చుకుంది. అక్కడి నుంచి మొదలైన మెస్సీ ప్రస్థానం ఫుట్‌బాల్ చరిత్ర పుటలను తిరగరాసింది. సుదీర్ఘ కాలం పాటు బార్సిలోనాకు లెక్కలేనన్ని ట్రోఫీలు అందించిన మెస్సీ, ఆ తర్వాత పిఎస్‌జి, ప్రస్తుతం ఇంటర్ మయామి క్లబ్‌లలో తన హవా కొనసాగిస్తున్నారు.
ఒకానొక సమయంలో దేశానికి పెద్ద కప్పులు అందించలేదనే విమర్శలు వచ్చినా.. వాటన్నిటినీ పటాపంచలు చేస్తూ 2021 కోపా అమెరికా, 2022లో కలేజా చూపించి గెలిచిన ఫిఫా ప్రపంచ కప్, ఆపై 2024 కోపా అమెరికా టైటిళ్లతో అర్జెంటీనాను ప్రపంచ విజేతగా నిలిపి తన కెరీర్‌ను సంపూర్ణం చేసుకున్నారు.రికార్డుల వేటలో మెస్సీకి ఆయనే సాటి, ఎవరూ లేరు ఆయనకు పోటీ! అర్జెంటీనా తరఫున 207 మ్యాచ్‌ల్లో ఏకంగా 125 గోల్స్ సాధించి అత్యధిక గోల్స్ చేసిన వీరుడిగా రికార్డు సృష్టించారు.
ప్రపంచంలోనే అత్యుత్తమ ఫుట్‌బాలర్‌కు ఇచ్చే అత్యున్నత పురస్కారం ‘బ్యాలన్ డి ఓర్’ (Ballon d’Or) అవార్డును రికార్డు స్థాయిలో 8 సార్లు ముద్దాడిన ఏకైక ఘనుడు మెస్సీ. ఆయన డ్రిబ్లింగ్ శైలి, అద్భుతమైన ఫ్రీ-కిక్స్ ఫుట్‌బాల్ చరిత్రలోనే ఒక అద్భుతం. అందుకే ఆయనను ప్రపంచం ‘GOAT’ (Greatest Of All Time) అని పిలుచుకుంటుంది. మైదానంలో ఈ సువర్ణ అధ్యాయం ముగిసినా.. చరిత్ర ఉన్నంత వరకు, ఫుట్‌బాల్ ఆట ఉన్నంత వరకు లియోనెల్ మెస్సీ పేరు, ఆయన సృష్టించిన సామ్రాజ్యం సజీవంగానే ఉంటాయి. థ్యాంక్యూ మెస్సీ..