రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే హాట్ టాపిక్.. మంత్రి కొండా సురేఖపై వేటు పడనుందా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజా ఢిల్లీ పర్యటన చూస్తుంటే అవుననే సమాధానమే బలంగా వినిపిస్తోంది. అధిష్టానం పెద్దలతో సీఎం సమావేశం కానున్న నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ వ్యవహారం ఇప్పుడు క్లైమాక్స్‌కు చేరుకున్నట్లు స్పష్టమవుతోంది. రాజకీయ వర్గాల్లో జరుగుతున్న పరిణామాలు గమనిస్తే ఆమెకు కౌంట్ డౌన్ మొదలైనట్లే కనిపిస్తోంది.
కూతురు పెట్టిన కుంపటి
కొండా సురేఖ చుట్టూ ఇంత పెద్ద వివాదం ముసురుకోవడానికి ప్రధాన కారణం ఆమె కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలే. రాజీకోసం సీఎంకు రాఖీ కట్టి అంతా సెటిల్ అయినట్లు మంత్రి కొండా సంకేతాలు ఇచ్చినా, సుస్మిత చేసిన ఆ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. కూతురు అసా మాట్లాడిన వెంటనే కొండా వాటిని ఖండించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది, కానీ ఇంత వరకు కూతురు తీరును తప్పుబట్టలేదు కదా, ఆ వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని మాత్రమే క్రమశిక్షణ కమిటీకి సురేఖ వివరణ ఇచ్చారు. దీన్నిబట్టి కొండా ఫ్యామిలీ అంతా ఒకే లైన్ లో ఉందని తేలిపోతోంది. అందుకే ఈ విషయంలో ఇక ఉపేక్షించేది లేదని సీఎం చెబుతున్నారట.
అటు పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్న ఈ వ్యవహారంపై ఒకరిద్దరు మంత్రులు, సీనియర్ నేతలు కూడా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ కి ఫిర్యాదు చేశారు. ఈ పరిణామాలతో పీసీసీ క్రమశిక్షణా కమిటీ రంగంలోకి దిగి, పూర్తి స్థాయి నివేదికను అధిష్టానానికి సిద్ధం చేసింది.
ఢిల్లీలో భేటీ.. వేటు రెడీ?
మంగళవారం ఉదయం ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి.. బుధవారం ఏఐసీసీ పెద్దలతో కీలక సమావేశాలు జరపనున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌లతో జరిగే ఈ భేటీలో పీసీసీ క్రమశిక్షణా కమిటీ ఇచ్చిన నివేదికపైనే ప్రధానంగా చర్చ జరగనుంది. సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించాలని సీఎం రేవంత్ రెడ్డి గట్టిగా పట్టుబట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అధిష్టానం పెద్దలు కూడా ఈ విషయంలో ఏమాత్రం రాజీపడే ధోరణిలో లేరని, క్రమశిక్షణ ఉల్లంఘనపై ‘నో కాంప్రమైజ్’ అనే సంకేతాలు ఇస్తున్నారని సమాచారం.
సాధారణంగా మంత్రివర్గ విస్తరణ లేదా కొత్తవారిన తీసుకోవడం లాంటి అంశాలకు కాస్త సమయం తీసుకున్నా.. కొండా సురేఖ విషయంలో మాత్రం తక్షణం యాక్షన్ తీసుకునేలా పావులు కదులుతున్నాయి. సీఎం పట్టుదల, హైకమాండ్ సీరియస్‌నెస్ చూస్తుంటే ఆమెను కేబినెట్ నుంచి తప్పించడం దాదాపు ఖాయమనే ప్రచారం గాంధీ భవన్ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
చిన్నారెడ్డి పరిస్థితి ఏంటి?
మరోవైపు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి వ్యవహారం కూడా ఈ ఢిల్లీ టూర్‌లో తేలిపోనుంది. ఆయనపై కూడా పీసీసీ క్రమశిక్షణా కమిటీ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో, కొండా సురేఖతో పాటే చిన్నారెడ్డిపై కూడా ఒకేసారి వేటు వేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
మొత్తం మీద సీఎం ఢిల్లీ పర్యటన ముగిసే సరికి ఈ ఇద్దరు నేతల రాజకీయ భవితవ్యంపై ఒక స్పష్టమైన, కఠినమైన నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.