మోడీ సమాధానం చెప్పాలంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫైర్
ప్రధాని మోడీ, బీజేపీ ముఖ్యమంత్రులు విదేశీ పర్యటనలకు వెళ్లొచ్చు కానీ తెలంగాణ ముఖ్యమంత్రిగా తాను పర్యటించకూడదంటూ ఆంక్షలు విధిస్తున్నారంటూ కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి.
- ప్రధాని ఇంకా గుజరాతీగానే వ్యవహరిస్తున్నారు తప్ప భారత ప్రధానిగా వ్యవహరించడం లేదు
- ఇది రేవంత్ రెడ్డికి వ్యక్తిగతంగా జరిగిన అవమానం కాదు
- ఇది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు జరిగిన అన్యాయం
- దీనినిని రాజకీయాలకు అతీతంగా ఖండించాల్సిన అవసరం ఉంది
- తెలంగాణ ముఖ్యమంత్రి పర్యటనను కేంద్రం అడ్డుకోవడం తెలంగాణ అభివృద్ధిని వ్యతిరేకించడమే
రాజకీయ కారణాలతో తన పర్యటనకు అనుమతి నిరాకరిస్తున్నట్లు చెప్పారని, ఆ కారణాలేంటో ప్రధాని మోడీ చెప్పాలని డిమాండ్ చేశారు. నిజంగా తన విదేశీ పర్యటనలో విషయం లేదనుకుంటే ఇంగ్లాండ్ కు ఎందుకు అనుమతి ఇచ్చారు? అమెరికాకు ఎందుకు తిరస్కరించారు? చెప్పాల్సిందేనన్నారు సీఎం.
మోడీ సర్కార్ వైఖరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సత్సంబంధాలను దెబ్బతీసేలా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతించకపోవడంతో లండన్ నుంచే రాష్ట్రానికి తిరిగి వచ్చిన సీఎం, సచివాలయంలో మంత్రులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.
రాజకీయ పార్టీల మధ్య సిద్ధాంత వైరుధ్యాలు ఉండొచ్చు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు ఉండాలన్నారు రేవంత్ రెడ్డి. కేంద్రం వైఖరితో తెలంగాణకు రావాల్సిన పెట్టుబడులు రాకుండా పోతాయన్నదే మా ఆవేదనన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం కచ్చితంగా కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. రాష్ట్రాల కలయికనే కేంద్ర ప్రభుత్వం. ఇది భారత దేశ ప్రజాస్వామ్య స్ఫూర్తి అని, కేంద్రం తీరు దాన్ని కాలరాసేలా ఉందంటూ దుయ్యబట్టారు.
తెలంగాణ అభివృద్ధి కోసం విద్య, క్రీడలు, పెట్టుబడులు లక్ష్యంగా తమ విదేశీ పర్యటన కార్యాచరణ రూపొందించుకున్నామన్నారు రేవంత్, దీనికి సంబంధించి విదేశాంగ మంత్రిత్వ శాఖకు పూర్తి సమాచారం అందించామన్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ కూడా ఇంగ్లాండ్ పర్యటనకు అనుమతి ఇచ్చి అమెరికా పర్యటనకు నిరాకరించడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఈ విషయంలో కేంద్రం వైఖరిని అందరూ తప్పు పట్టారన్న సీఎం, తన పర్యటనను తిరస్కరించడమే కాకుండా బీజేపీ నాయకులు రాజకీయంగా తనపై వ్యక్తిగత ఆరోపణలు చేశారని విమర్శించారు.
తన పరియటనను అడ్డుకున్న కేంద్రం, ఆగస్టు 17 నుంచి 28 వరకు అమెరికా, కెనడాలో పర్యటించడానికి గుజరాత్ ముఖ్యమంత్రికి ఎలా అనుమతించిందంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. వైబ్రంట్ గుజరాత్ అని పెట్టుబడుల కోసం గుజరాత్ ముఖ్యమంత్రికి అనుమతి ఇచ్చామంటున్న కేంద్రం, తెలంగాణ రైజింగ్ 2047 లో భాగంగా అమెరికాలో పర్యటించాలనుకుంటే ఎందుకు అడ్డుకున్నారంటూ నిలదీశారు. గుజరాత్ అభివృద్ధికి ఇబ్బంది కలుగుతుందనే తన పర్యటనను కేంద్రం అడ్డుకున్నట్లు కనిపిస్తోందని రేవంత్ ఆరోపించారు.
కేంద్రం వైఖరి చూస్తోంటే తెలంగాణపై వివక్ష స్పష్టంగా కనిపిస్తోందన్నారు సీఎం. కాంగ్రెస్ ఎంపీలు ఈ అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావిస్తారన్నారు. తెలంగాణ అంటే మోదీకి వివక్ష.. చిన్న చూపని, తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు గుజరాతీ నాయకత్వం చేస్తున్న కుట్రగా దీన్ని చూడాలన్నారు రేవంత్ రెడ్డి.