తెలంగాణ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం అసెంబ్లీ సమావేశాల ముంగిట అనూహ్యమైన మలుపు తిరిగింది. సాధారణంగా శాసనసభ సమావేశాలు సమీపిస్తున్నాయంటే, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ప్రతిపక్షం అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకోవడం, వాటిని తిప్పికొట్టేందుకు పాలకపక్షం రక్షణాత్మక ధోరణి అవలంబించడం ఆనవాయితీ. కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సంప్రదాయానికి భిన్నంగా పావులు కదుపుతున్నారు. బీఆర్ఎస్ విమర్శలకు కేవలం సమాధానాలు చెప్పే స్థాయి నుంచి, నేరుగా ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ లక్ష్యంగా ఎదురుదాడికి దిగడం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది.
ముఖ్యమంత్రి తాజా వ్యాఖ్యలను పరిశీలిస్తే.. ఆయన వ్యూహం స్పష్టంగా అర్థమవుతోంది. కేసీఆర్ ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారన్న పాత విమర్శకే, జవాబుదారీతనం అనే కొత్త పదును పెట్టారు రేవంత్. “ఏడాది పాటు విధులకు హాజరుకాని ఉద్యోగిని డిస్మిస్ చేస్తారు. మరి వెయ్యి రోజులుగా పదవిలో ఉండి, కనీసం వెయ్యి గంటలు కూడా ప్రజల కోసం కేటాయించని ప్రతిపక్ష నేతను ఏం చేయాలి?” అన్న ముఖ్యమంత్రి ప్రశ్న కేవలం రాజకీయ విమర్శ కాదు, ప్రజల్లో ఒక బలమైన ఆలోచనను రేకెత్తించే ప్రయత్నం. మూడేళ్ల కాలంలో ప్రతిపక్ష నేతగా రూ. 1.84 కోట్ల వేతనం, భద్రత తదితర మౌలిక సదుపాయాల కోసం మరో రూ. 22.24 కోట్ల ప్రజాధనం ఖర్చయిందని గణాంకాలతో సహా ముఖ్యమంత్రి ప్రజల ముందుంచడం ఈ వ్యూహంలో భాగమే. ప్రజాధనం ఖర్చువుతున్నప్పుడు, దానికి తగ్గ బాధ్యతను నిర్వర్తించాలన్న కనీస ప్రజాస్వామ్య సూత్రాన్ని ఇక్కడ రేవంత్ రెడ్డి ఎత్తిచూపుతున్నారు.
కేవలం మాటలకే పరిమితం కాకుండా, కాంగ్రెస్ శ్రేణులను క్షేత్రస్థాయిలో కార్యోన్ముఖులను చేయడం ద్వారా ముఖ్యమంత్రి మరో అడుగు ముందుకేశారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే 7వ తేదీకి ముందు.. సెప్టెంబర్ 1 నుంచి 6వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా మండల, జిల్లా కేంద్రాల్లో నిరసనలు, హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద ధర్నాకు పిలుపునివ్వడం ద్వారా ప్రతిపక్షంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి పెంచుతున్నారు. ‘కేసీఆర్ రాజీనామా చేయాలి’ అనే డిమాండ్‌ను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడం ద్వారా, సభ ప్రారంభమయ్యే నాటికి బీఆర్ఎస్‌ను పూర్తిగా ఆత్మరక్షణలో పడేయాలన్నది కాంగ్రెస్ ఎత్తుగడగా కనిపిస్తోంది.
మరోవైపు, తెలంగాణ సెంటిమెంట్‌ను, సామాజిక సమీకరణాలను బ్యాలెన్స్ చేసే దిశగానూ ముఖ్యమంత్రి అడుగులు వేస్తున్నారు. అల్వాల్, ఎల్బీనగర్, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ల టీమ్స్‌కు తెలంగాణ దిగ్గజాలు టీ.అంజయ్య, కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొఫెసర్ జయశంకర్ పేర్లను పెట్టడం ద్వారా ఆయా వర్గాల మనోభావాలను గౌరవిస్తూనే, తెలంగాణ వాదం తమదేనన్న సంకేతాలు ఇస్తున్నారు. అలాగే, తన క్యాబినెట్‌లో సామాన్యులకు పెద్దపీట వేశానని చెబుతూ, బీఆర్ఎస్ కుటుంబ పాలనపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.
అంతిమంగా, రేవంత్ రెడ్డి విసిరిన ఈ సవాల్ ప్రతిపక్షాన్ని ఇరకాటంలో పెట్టిందనే చెప్పాలి. “దమ్ముంటే 7వ తేదీన సభకు రండి.. పదేళ్ల మీ పాలన, వెయ్యి రోజుల మా సుపరిపాలనపై చర్చిద్దాం” అని ముఖ్యమంత్రి విసిరిన సవాల్‌కు ప్రధాన ప్రతిపక్షం ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరం. సభకు వస్తే నేరుగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత, రాకపోతే రాజకీయంగా భయపడ్డారన్న అపప్రథ రెండూ బీఆర్ఎస్ ముందున్న సవాళ్లే. ఏది ఏమైనా, రాబోయే అసెంబ్లీ సమావేశాలు తెలంగాణ రాజకీయాల్లో ఆధిపత్య పోరుకు, కీలకమైన చర్చలకు వేదిక కానున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.