నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న విద్యార్థులు కిందపడి గాయపడిన ఘటన మినహా మిగిలినదంతా సాఫీగా జరిగిపోయింది. ప్రాంగణం మొత్తం విద్యార్థులు, అభిమానులతో కిక్కిరిసిపోయింది. మన ప్రేక్షకుల ప్రేమను కెజిఎఫ్ రూపంలో చవి చూసిన హీరో యష్ ప్రత్యేకంగా తెలుగులో అరగంట సేపు మాట్లాడి స్వీట్ షాక్ ఇచ్చాడు. ఇరవై సంవత్సరాల తమిళ స్టార్ల వల్ల కానిది స్టేజి మీద ఈ శాండల్ వుడ్ నటుడు చేసి చూపించాడు.
మల్లారెడ్డి యునివర్సిటిలో చేయడం ద్వారా టాక్సిక్ కు కలిగిన అతి పెద్ద ప్రయోజనం జన సమీకరణ. వేలాది విద్యార్థులు చదువుకునే ఆ విద్యాసంస్థల గ్రూప్ నుంచి స్టూడెంట్స్ కు ఈజీగా పాసులు వచ్చేస్తాయి. ఐడి కార్డు చూపించినా లోపలికి పంపిస్తారు. పైగా టాక్సిక్ లాంటి ప్యాన్ ఇండియా మూవీ కావడంతో సహజంగానే వాళ్ళు భారీ సంఖ్యలో విచ్చేశారు. ఒక దశలో యష్ టెన్షన్ పడ్డాడు. ఏదైనా జరగరానిది జరిగితే ఎలానే ఆందోళన బయట పడింది. తీవ్రంగా ఏదీ జరగకపోవడం రిలీఫ్. మల్లారెడ్డి వైరల్ స్పీచ్, ఆయన కోడలు స్టూడెంట్స్ కి ఇచ్చిన వార్నింగ్ బోనస్ అయ్యాయి.
నయనతార మినహాయించి మిగిలిన లేడీ క్యాస్టింగ్ కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి విచ్చేయడం ద్వారా టాక్సిక్ కు గ్లామర్ కోటింగ్ బాగా వచ్చింది. అందులో సినిమా గురించి ఒక్కొక్కరు ఒక్కో రేంజ్ లో ఎలివేషన్లు ఇచ్చేసరికి అంచనాలు మరింత పెరిగిపోయాయి. దిల్ రాజు రెండు వేల కోట్ల స్టేట్ మెంట్ కొంచెం అతిశయోక్తిగా అనిపించినా ఆ మాట సంగీత దర్శకుడు విశాల్ ద్వారా వచ్చింది కాబట్టి అంతగా ఫోకస్ పడలేదు.